Wednesday, 17 August 2016

హరిహరనాథ శతకము





హరిహరనాథ శతకము
తొలి ముద్రణ – 1959

పద్య మ్మొక ‘వరహా’ గా,
హృద్యమ్మై, పాఠకులకు నిహపరహిత సం
వేద్యమ్మై, ముత్కరమున
కాద్యమ్మై, యలరుగాత! హరిహరనాథాః


అభిప్రాయము
                                               
హరిహరనాథశతకము

(శ్రీ కవిసార్వభౌమ, ఆంధ్ర వ్యాస, వేదవిద్యావిశారదేత్యాది మహాబిరుద విరాజమానులు, ఆంధ్ర ఆస్థాన కవులు శ్రీపాద కృష్ణ మూర్తి శాస్త్రి గారు, రాజమండ్రి)

                                      ఇది ద్వారకాతిరుమల సమీపములోనున్న దొరసానిపాడను గ్రామములో నెలిమెoటరీ స్కూలుమాస్టరుగా నున్న మహమ్మద్ హుస్సేన్ అను మహమ్మదీయ కవి రచించెను. ఈ కవి నాకు 20 సంవత్సరములనుండి పరిచితుడు. శిష్యప్రాయుడు. నా యందు మిక్కిలి దయగలవాడు. ఇతడు గర్వములేనివాడు. సజ్జనులలో జేర్పదగిన వ్యక్తి. మహామ్మదీయుడయ్యు నితర మతముల నిరసించువాడు కాడు. అందులకీ శతకమే సాక్ష్యము.

                             ఈ కవి రచనము మిక్కిలి సరళము, కవిత్వము
                             ధారాళముగా, గుంటు పడక మనోహరముగా
నుండును. నేనీ శతకము అటనట జూచితిని
చక్కని కల్పనలతో, భక్తిరస ప్రధానముగా నున్నది.

రాజమండ్రి,                                                                                                    ఇట్లు,
9-8-1959                                                                  శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి, ఆంధ్ర ఆస్థాన కవి







స్మరణ
జననీ! సాత్విక భావభూషణ ఘృణీ!  సాజన్య సౌదామనీ
పెనుక్షామమ్ములు, గాంచి – పెక్కిడు మలన్ వీక్షించి – సైరించి – నీ
చనుబాల్ సత్త్వ మొసంగి సాకితివి – నా సాహిత్యవైదగ్ధ్య  సం
జనకం బెన్నోకృతుల్ వెలార్చితి – కృతజ్ఞత్వంబు చెల్లించెదన్

ననుముద్దారగ – నగ్ర పుత్రుడని – విన్నాణం బునన్ బెంచి - పె
ద్దను గావించి – సుభాశిషంబులిడి  - విద్యా బుద్ధులన్ నేర్వజే
సిన మాయమ్మ “హుసేను బీబి “ – ఋణమున్ జెల్లింతునేనెట్లు ? చం
ద్రున కర్పించెడు నూలు పోగనగ గూర్తున్ – నా నమోవాకముల్.

జనకా! దేశికవృత్తియందు - నిను మించంజాలు, వారెవ్వరున్
గనరా “రన్నయశమ్ము గాంచితివి, రంగ గద్వైద్య రంగమ్మునన్
జను “లోహో“ యనుకీర్తి గొంటివి ‘సిలార్ సాహెబ్ ‘ – ప్రసిద్ధాహ్వయ
మ్మున వేనోళ్ళ పొగడ్త లందితివి - కైమోడ్పుల్ - గ్రహింపంగదే !

                                                                        కుమారుడు
దొరసానిపాడు                                                మహమ్మద్ హుస్సేన్











1.       శ్రీకరమై, నీ నామము
ధీకరము నగణ్య పుణ్య దీప్తికరమ్మై,
లోకోత్తర శీలకర
మ్మై, కావుత మమ్మునెపుడు, హరిహరనాథా.

2.       భక్తి ప్రధాన నిర్మల
రక్తిన్, యుష్మత్కృపాతరంగిత దీవ్య
చ్చక్తిని గొని యనుపమ స
మ్యక్త్రుప్తి రచింతు దీని, హరిహరనాథా.

౩.   కందంబులు, భక్తిరసా
నందoబులు, నవరసార్ద్ర నానాగుణమా
కందంబులు, వరశిల్పపు
టoదంబులు, స్వీకరింపు, హరిహరనాథా.

4.       కందమ్ములు, లోఁ జూపుం
గందమ్ములు, లెస్సగొనవు గందమ్ములు, బల్
బందమ్ములు మఱుబాముల,
కందమ్ములు తెనుఁ గునుడికి, హరిహరనాథా.

5.       నీ కరుణ, కృతార్థ సుధా
సేకరణ, మఖర్వ వృజిన జీమూతవిశు
ష్కీకరణ, మపూర్వ ప్ర
జ్ఞాకరణ, మకారణముగ, హరిహరనాథా.

6.       పాపంబులు, మత్కృత్యా
పూపంబులు, స్వార్ధవిషయ భోగాభోగా
వాపంబులు, నానాజ
న్యాపద్రూపంబు; లడచు, హరిహరనాథా.

7.       కవి “ముసిలి” మ్మట! వ్రాసెడు
కవనము జాను తెనుఁగునట: కవితా ప్రభువో!
భవహర: హరిహర పతివఁ ట:
హవణిల్లదే సుంత వింత: హరిహరనాథా.

8.       ఏదో యభిశాపము నా
పై, దారుణదాహమూని బలవత్కామో
న్మాదిగ, నధముగఁ జలిపెడు
నాదట, నను సంతరింపు – హరిహరనాథా.

9.       హరిదేవుoడని కొందఱు
హరుఁ డే విభుఁ డంచుఁ గొందఱoదురు; నీవో
యిరుతెగల, కఖిల మతముల
నరిగెడు వారలకుఁబతివి, హరిహరనాథా.

10.   అలఘు సమీరా హతిచేఁ
జలితంబగు పర్ణమట్లు స్వాంతము విషయా
కులమయ్యె, విశoకట వి
హ్వలమయ్యె, వివేకమిమ్ము, హరిహరనాథా.

11.   కలుషాచిత కామాగ్నికి
శలభమనై, నిగ్రహాత్మ సందగ్ధుడనై,
          గళిత స్వత్వుఁ డనైతిని
నలసుఁ డఁ , దన్ముక్తినిమ్ము, హరిహరనాథా.

12.   క్రోధంబధముని విత్తము
క్రోధము బాధాకరంబు, కుటిలవ్యాపా
రైధిత సాధన, మేతద్
వ్యాధి విముక్తునిగాఁ జేయు హరిహరనాథా.

13.   అసహనమను చీకుతనం
బసమంబుగా సంక్రమించు యతులితలోభ
వ్యసనాధ్వగామి సలిపెడు
నసహాయుఁ డ నన్నుఁ గావు, హరిహరనాథా.

14.   ఒరుల సమున్నతి, గనుగొని
యరుసంబును బడయలేని యల్పాత్ముండన్
దురహంకారుడ జాల్ముడ,
నరసిననుం దిద్దుమయ్య, హరిహరనాథా.

15.   పరుల నధిక్షేపించెడు
పరమాధమతమ గుణంబు పాయసమయ్యెన్,
సరిదిద్దు కడిమి చేకుఱ,
దరయుము నీ ప్రాపు నొసగి, హరిహరనాథా.

16.   ఈ గ్రహచారబలంబే
మో: గ్రాహ్యముకాదు, యత్నముల్ సల్పియుఁ ,గా
మగ్రాహమునకు బలియై
వ్యగ్ర మనస్కుండనైతి, హరిహరనాథా:

17.   ఇంగువ ముడువగఁ దావులు
బొంగెడు వలువట్లు పూర్వపుం బాముల, నా
రంగు గుబుల్కొను జీవిత
మంగుగ సరిదిద్దుమయ్య: హరిహరనాథా:

18.   రసనాగ్రంబున నీ నా
మసుధా మాధుర్యరుచులు మలయఁ గఁ ,జిత్తం
బసమవ్యర్ధ స్వార్ధ
వ్యసనంబునఁ  జిక్కుఁ ; గావుఁ  హరిహరనాథా:

19.   శరణమయాః కరుణామయ:
శరణమయాః పాపనాశ! సకలాధీశా:
శరణమయ! భక్తసముదయ!
యరుదగు నీ ప్రాపునిమ్ము: హరిహరనాథా:

20.   ఇదియిటు బొడము టసంగత,
మదియటు ఘటియించు టొప్పదని వెంగలినై,
మదిఁ దలతుగాని నామే
లదిరా: యెఱుగుదువు నీవ: హరిహరనాథా:

21.   ఎదియున్నను జన్నను, నా
విదిత వివేకాత్త చిత్త విద్బలమునకున్
గొద గల్పింపకుమా: యెద
నదటును మొదలంటఁ ద్రుంచి, హరిహరనాథా!

22.   ఏనాఁ టి కుసంస్కారమొ!
మానక చెడు చెయుదులందు మరఁ గెడు, నస్మ
న్మానసము, దీనిఁ గాదన,
నౌననఁ జాలదు బలంబు, హరిహరనాథా.

23.   ఏనాఁ టి కుసంస్కారమొ!
హీనుఁ డు మానస నరేశుఁ డింద్రియ భటులన్
ఏన పథంబుల నడపెడు
హానిని గ్రహియింపలేమి, హరిహరనాథా.

24.   ఏనాఁ టి కుసంస్కారమొ!
జ్ఞానుల సాధువుల పుణ్యసంగతి యన్నన్
మానస మోర మొగంబిడు
నౌననదు తదుక్తులెన్న; హరిహరనాథా.

25.   నీ యాజ్ఞా మాత్రమ్మునఁ
బాయక యనుకూల వృష్టివారిదుఁడిచ్చున్
వాయువు నిలువక పరువిడు
నాయతలోకార్ధ విధికి, హరిహరనాథా.

26.   నీ యాజ్ఞా మాత్రమ్మునఁ
బాయక వేఁడియును వెలుఁగు జ్వలనుoడొసఁగున్
ఛాయాపతి నిల సుట్టెడు
నాయత లోకార్ధవిధికి, హరిహరనాథా:

27.   నీ యాజ్ఞలేక చీమయు
నే యాకును గదలఁ జాల నీ విశ్వoబుల్
నీ యొక తలపుఁ న నిలిచెన
యా! యద్భుతగతులు సెలగ, హరిహరనాథా:

28.   బలవంత మెంత చేసినఁ
బలుకదు, నులుక, దనురక్తిఁ బడయదు భక్త్యు
జ్జ్వలదామోదము మూర్కొన,
దలయించు మనంబు మివుల, హరిహరనాథా:

29.   బలవంత మెంత చేసిన
నిలుపదు నీయందు భక్తిఁ నియతి లవంబున్
అలఘుతరైహిక సుఖముల
నలరెడు నా చెనటి యెడఁ ద, హరిహరనాథా:

30.   బలవంత మెంత చేసిన
నిలువదు గట్టుతెగు నేటి నీటిం బలెఁ  జం
చలమై పర్వెడు, విషయపు
టలలందేలుచు మనంబు, హరిహరనాథా.

31.   బలవంత మెంత చేసిన
వలదనదయ్యా: మనంబు పరవిత్తములన్
జెలఁ గి సుధవోలెఁ  గ్రోలఁ గ,
నలఘు ప్రేరణ మొనర్చు, హరిహరనాథా:

32.   బలవంత మెంత చేసిన
వలదనదయ్యా: మనం బబద్ధము లాడన్
దులకించెడు, విదలించెడు,
నలయక ప్రేరేచుఁ గావు, హరిహరనాథా!

33.   నీ యక్కటి కము బో లని
మా యత్నము పురుషకారమా: కాదుప్రభూ:
యే యెడ, నిద్దపుటద్దం
బాయతమగు వెలుఁ గులిడునె? హరిహరనాథా:

34.   ననలెత్తు క్రొత్త తలఁ పుల
మనోలతిక, కర్మవశ త, మవ్వముసెడి, క్రుం
గెను, వాడి వత్తలయ్యెడు
ననుకంపను జాటుమాలి: హరిహరనాథా:

35.   నీ నెనరు దనరు మనిసికి
జానుగఁ బెనుకడలి నడుమ సడలెడు విడుమల్
నీనెనరు గననిమనుజుని,
హానియ పెనగొనెడు నింట, హరిహరనాథా:
                                              
36.   లౌకిక కృతి శతమతినై
యేకడ సంతృప్తిఁ గనని హృల్లోభమునన్
జీకాకుపడి తపించుచు,
నాకాంక్షించెదను శాంతి, హరిహరనాథా:

37.   ఇది నా జాతక బలమో:
మదిసెడి నా చేయు పనుల మలయు ఫలమ్మో:
కదిసెడు ప్రాగ్జన్యఘమో:
యదుమంబడు వెతలఁ  దొలఁ చు, హరిహరనాథా:

38.   అడుసునఁ బడి చిడిముడిచేఁ
గడఁ గనఁ బడ కడలు బడుగుఁ గైవడి బుడమిన్
గడు నిడుమలఁ బడి యడలుదు
నడరెడు చెడుగులకు జడిసి, హరిహరనాథా:

39.   అధికార రోగ వాంఛా
మధనాయత్తము మదీయమానస మకటా!
వ్యధల విదగ్ధం బయ్యెడు
నధమస్థితి దీనిఁ దొలచు, హరిహరనాథా:

40.   విషభరిత పాత్రఁ గైకొని
తృషవాపికొనంగఁ ద్రావు దీనుఁ డనైతిన్
మృషయిదికాదు ప్రభూ: విష
యషడ్వికారములఁ దొలఁ చు, హరిహరనాథా:

41.   “తానొకటి దలఁ ప దైవం
బూనుఁ బెఱతలంపు” నా బుధోత్తము లనుటల్
నానృతములు, నీచిత్తం
బౌనటు ననుఁగనికరింపు, హరిహరనాథా:

42.   గాలికి వదలిన నావం
బోలి యధేచ్చా విహారముల పరువళ్ళన్
సోలెడుఁ జొక్కెడు, నామన
మాలింపదు సముచితంబు, హరిహరనాథా.

43.   నిన్నే తక్క మఱొక్కని
నెన్నఁడు నే విశ్వసించి ఎఱుగను,గొల్వన్
ఎన్నను గిడిగిళ్ళిడలే
నన్నా: చన్నే: యుపేక్ష: హరిహరనాథా:

44.   ఎండినమ్రాఁకు చిగిర్చెడు
వెండి వసంతమున, నటులు, వృజినంబులచే
బెండువడియున్న నను నీ
వండగ మనుపంగదయ్య, హరిహరనాథా:

45.   ఆశాపాశముచే నను
నాశన మొనరింపకు, వృజిన ప్రౌఢుడు గాఁ
గ్లేశముల నిడకు, విపుల స
దాశయములు తొలఁగనీకు, హరిహరనాథా:

46.   నీతులు వలికెద నొరులకు
నీతి పథం బాశ్రయింప నేరను నాయీ
చేతో దౌర్బల్యము, దే
వా: తొలఁచుము, బలము నిమ్ము, హరిహరనాథా:

47.   “కొట్టెద నన్న భయంబును
బెట్టెద నన, నాశ యుద్భవించుట “సతతం
బెట్టిరకైనను సాజం
బట్టిట్టన కింకఁ గావు హరిహరనాథా:

48.   సముదారాశయములు, డెం
దమున సదా కుదురుకొనఁగ నను దిద్దుమయా
విమతుల బాటలఁ బోవని
యమలాత్మ ననుగ్రహించి, హరిహరనాథా:

49.   నా యొనరించెడు జతనము
నీ యనురాగంబు కలన నిర్విఘ్నం బై,
యే యెడ, జయమగు వరమి
మ్మా: యర్పించెద మనంబు, హరిహరనాథా:

50.   ఎది కర్జమో: యెదికాదో:
మదిని వివేకింపలేని మతిహీనుఁ డ, నా
యదనులఁ గని, నెఱిదిట విడి
యదవదలఁ దొలంచుమయ్య హరిహరనాథా:

51.   నీ యానతి మీఱితి, న
న్యాయముఁ జేసితి, భయంకరాఘౌఘ ప్ర
జ్ఞాయుతుఁ డనైతి; గతమతి
నై, యశ్రులు రాల్చుచుంటి, హరిహరనాథా:

52.   పాపములు సేయుచుంటయుఁ
గాపాడఁ గ వేఁ డుచుంట, కడుసాజంబై
రూపఱియె, మదాత్మ బలం
బాపన్నుఁ డఁ గావు నన్ను, హరిహరనాథా:

53.   ఘోరాత్మకాజవంజవ
నీరధిలో మునిఁ గిపోయి నిత్యము సుంతన్
బారంబుఁ జేరకడలెద
నారసి తీరంబుఁ జేర్పు, హరిహరనాథా,

54.   అలఘు వ్యధలను సైఁచెడు
కొలఁ దిని మానవ కృతాతి ఘోరాఘంబుల్
తొలఁ గునని పెద్దలాడుదు,
రలఁ తి మదిం దనరువాఁ డ, హరిహరనాథా.

55.   గోరంత గోరమగుచో
వారక గొండంతగాఁ గఁ బలవించు వృధా
భీరు స్వాంతుఁ డ నల్పుఁ డ,
నారసి ననుఁ గావుమయ్య: హరిహరనాథా.

56.   జాలిఁ గొని నన్ను మఱవక
“పాలను ముంచెదవో? నీటఁ బడవైతువొ?” నీ
పాలంబడి కై మోడ్చితి
నాలింపుము నాదు మొఱను, హరిహరనాథా:


57.   భరమై, ఖరమై, క్షరమై:,
నిరయంబై, సకలదోష నిలయంబై, యు
ర్వర నరజీవిత మతిసుఖ
హరమై, కన్పట్టుఁ గావు, హరిహరనాథా:

58.   నీ చిద్విలాస మనుపమ
ధీచతురులె యరయలేక, తెల్ల మొగంబుల్
వైచి నిరుద్యములై, రా
హా: చాలుదు నోటునేను, హరిహరనాథా:

59.   కోటానుకోట్ల ధనమిడి
గాటముగా మనిచినట్టి కరణిని దృప్తిం
జాటెద, సనామయాత్మక
హాటకమిడి నన్నుసాఁ కు, హరిహరనాథా:

60.   చలమా: బలవత్కోపా
నలమా: యిది నీవు దారుణ స్వాంతులఁ బా
పుల శిక్షించెడు ఛలమా:
యలమట లిటులేల యిడుదు? హరిహరనాథా:

61.   జానెఁడు  ప్రాఁకఁగ లోఁదలఁ
పూనినచోఁ గ్రుంగిపోదు నొక బారెఁడు, నా
పూనిక దొసఁగో: యిది క
ట్టా: నాఁపుట్టువుల చెడుగొ: హరిహరనాథా:

62.   కొండంతటి దేవునకుం
గొండతగఁ బత్రి యిచ్చుకోఁగల మొక్కో
గుండియ నుడుగర సేసెద
నండగ నీనెనరు నింపు, హరిహరనాథా:

63.   కలవారి చిత్తమున, లే
ములఁ గుందెడు వారి భాగ్యముల్ నిఘ్నములై
చెలగిన “దేవర చిత్తం
బలరఁగ నా భాగ్య” మింక, హరిహరనాథా:

ప్రాతస్స్మరణం

64.   రాతిరియంతయుఁ గాచితి
వీ తనువును వేయిఁగనుల నెసకమెసంగన్
జేతః ప్రీతిఁ గృతజ్ఞత
లాతత గతినిడుదుఁ గొనుమఁ హరిహరనాథా:

65.   గురుతర బాధ్యతలను మా
శిరములఁ గొని లేచుచున్న శిశువులము, శుభం
కరమగు బ్రతుకుందెరువుల
నరిగెడు ధీబలము నిమ్ము, హరిహరనాథా:

66.   ఉదయార్కు కరమ్ములఁబలె
విదితవినిద్రిత మనంబు విప్పారునటుల్
ముదమెసఁగు బ్రతుకుబాటల
నదలింపుము నన్ను గుణిగ, హరిహరనాథా:

67.   ముకుళీకృత రాజీవము
వికసించిన భాతి బుద్ధి వికచంబయ్యెన్
వికలత్వ మెడల నడుపుమ:
అకలంక పథాలవెంట, హరిహరనాథా:

నిద్రానమయ స్మరణం

68.   మురిపెమిడు తల్లి యొడిమై
మఱచెడు శిశువట్లు, ప్రకృతిమాత్రంకమునం
దరుసమున, గూర్కుగను, మ
మ్మరయుము రేలందుఁగావ, హరిహరనాథా:

69.   తలిఱెక్కల చాఁటున, న
ర్మిలిఁ బులుఁ గుంబాప దాఁగురీతి, సుషుప్త్యు
జ్జ్వల డోలం జేరెడు నను
నలఘు కృపం బ్రోవుమయ్య, హరిహరనాథా:


70.   ఆసవమానినగతి ని
ద్రాసతి మైకంబుఁ గూర్పఁ దల్పము పాలై
వీస మెఱుoగఁ దనూస్థితి
నాసించెద నీదుకరుణ, హరిహరనాథా:

71.   కనుఱెప్పలఁ గొండలు వ్రా
లినవి, సుధీలతిక శోషిలినది, ప్రభూ: నీ
యనుకంపాభరశరణ
మ్మనుపం, బాశ్రయ మొసంగు, హరిహరనాథా:

72.   నిద్దుర గొనినట్టిఁడుఁ బెద
నిద్దురఁ గన్నట్టివాడు నిజము సముల్ గాఁ
బెద్దలు వల్కుదురే వెత
లద్దక ననుఁ బెనుపుమయ్య, హరిహరనాథా:

73.   నిరతము సత్సంకల్పో                                            
త్కరముల కొదువేమిలేక, కలుషపుఁదలఁపుల్
దరిఁజేరనీక. నా మది
నరసి, యొరసి, సంస్కరింపు, హరిహరనాథా:

74.   కనుమూసినఁగనుఁదెఱరచినఁ
గనవచ్చు భయంకరాఘ కర్మములు, మలం
బున మనియెడు పురువుంబలె
ననివార్యునిఁజేసి నన్ను, హరిహరనాథా:

75.   పరకాంతాజనతాసుం
దరతాజాలములఁ జిక్కి, నా హృత్పతగం
బెరగొని గిజగిజలాడెడు,
నరయుము నన్నుద్ధరింప, హరిహరనాథా:
   
76.   తలక్రిందుగఁ దపమైనం
జలిపి మనోరధ మొకింత సాధించుటకున్
గలదా: మాకు స్వతంత్రత,
యలరెడు నీ కూర్మిలేక, హరిహరనాథా:

77.   తానంబులు, నీమంబులు,
బోనంబులు విడిచి కనులు మోడ్చు జపంబుల్,
పూని మదినిల్పునే? దే
వా: నీనెనరింత లేక, హరిహరనాథా:

78.   పదులును వందలు వేలుగ
విదితపు యతనములు సలిపి, విసివి విసివి, యే
తుదిఁ గనక మరుని కడిమికి
నదరుచు నీ పాలఁబడితి, హరిహరనాథా:

79.   ఇది కావలెనని కోరను,
నెది యొదవిన ననుభవింతు నెటులేమైనన్
వదలను గృషి కర్జమునెడ,
నడవదలు దొలంచుమయ్య, హరిహరనాథా:

80.   చేటుపడువాని నోమఁగ
గాటపు మేలందువాని గండడగింపన్
సాటిగ నవుగాముల, మ
మ్మాడింపఁగను నీవ: హరిహరనాథా:

81.   “చేతులు కాలిన పదపడిఁ
గాతరమతి నాకులూను” కరణిని బాప
వ్రాతము పైబడ, నిత్తఱి
నాతురపడి నిన్నుఁ దలతు. హరిహరనాథా:

82.   లౌకిక విషయ నిమగ్నం
బై, కేంద్రీ కృతముగాక, యభ్యాసములన్
రాక, పెడతలం బట్టెన
యా! కలుషితమైన బుద్ది, హరిహరనాథా:

83.   “తక్కువ తెలివియు, నాకలి
యెక్కువ” యనుటెసఁగ నన్ను సృష్టించితివో,
లెక్కకు మిక్కిలి యిక్క
ట్లక్కట: వెక్కసము దోఁచె హరిహరనాథా:

84.   ననుఁ బోలు తెలివి నూలిన
మనిసిని మనఁ జేయుప్రోడ: మనుగడ దొడరం
జనెడుపని గడలు కొన; ని
మ్మనువుగ వెడగాని తెలివి, హరిహరనాథా:

85.   నీ సంకల్ప బలమ్మొక
వీసమ్మును జాలు జలధి బిందూకృతమై
గాసిల; హిమనగ మొక ఱా
యై సంభ్రమ మొదవఁ జేయ; హరిహరనాథా:

86.   నీ సంకల్ప బలమ్మొక
వీసమ్మును జాల్ ఖగోళ విశ్వవిసరముల్
గాసిల్లి బంతులం బలె
నై, సుడివడి యెగసిపోవ; హరిహరనాథా:

87.   ధరణిని సస్యశ్యామల
భరితం బొనరింపఁ జాలు వారిద మొకడే!
కరుణాసుధఁ జిలుకుచు, మ
మ్మరయఁ గ నీవొక్కరుఁ డవ, హరిహరనాథా:

88.   ననుఁ  బోలి దురాశా పా
శనిబద్ధ విబుద్ధియై, విషాద నిరాశా
ఘన తాపతప్త మతియగు
ననయుఁడు లేఁడొకఁడు గావు, హరిహరనాథా:

89.   భీకర మాత్సర్యాత్మక
కాకోదర రూపమింత గన్నంతన, బెం
డై, కాయము వడకెడు నీ
శా: కావుము సహన మొసఁ గి, హరిహరనాథా:

90.   శాత్రవులకన్న, నంత
శ్శాత్రవషట్కoబు మివుల సంక్షోభ మిడున్
రాత్రిం దివములు వేఁ డెద
నాత్రము మెయి; నన్నుగావు, హరిహరనాథా:

91.   అడుగడుగున దొడరెడునా
వెడఁగు నహoకృతిని గెడపి, వెడలఁగ బెడదల్,
ఎడ నీయెడ ముడిపడ, నెపు
డడరెడు వెడ నెడపి నడువు, హరిహరనాథా:

92.   పాపపుఁ దలఁపుల తూపుల
రాపుల కోపక, వివేకరత్నము తూంట్లై,
నాపసను రూపు మాపెడు,
నాపన్నుఁడఁ బ్రాపుఁజూపు, హరిహరనాథా:

93.   ‘ఇదికా’ దదియను, ‘నదికా’
దిదియను, నిది యదియు వదిలి యెదియో పదరున్
వదలని ముదములఁ బోదలగ,
నడవదపడి చెదరి యెడఁద, హరిహరనాథా:

94.   పతితుఁడు బునీతుఁడగునా:
యతి వక్రము శ్వాస పుచ్చ మకుటిలమగునా!
యతివస మధురoబగునా:
యతులాఘౌఘావరోధ: హరిహరనాథా:

95.   కోఁతికి మృదు సుమమా: యెను
బోతుకుఁ బన్నీటి జలమ! భూదారము సం
ప్రీతిఁ గనఁదల్పమా: నా
కా! తత్త్వజ్ఞానమోటు, హరిహరనాథా:

96.   ధన సంపాదనమన మన
మెనలేని జపంబు సూపు, నెవ్విధి బలమో:
నిను సేవింపఁగఁ జనుమన
ననుకూలింపదు సుమంత, హరిహరనాథా:

97.   వేయి పుటమ్ములు వెట్టిన
నాయజ్ఞానము దొలంగునా? నీ కరుణా
పీయూషమింత జుఱ్ఱక
హాయిగ మతినిన్నుఁ గనక, హరిహరనాథా:

98.   చిలిపితలంపుల కంపుం
జిలుకుచుఁ బెంపారునెడ్డెచేఁ తల యెడఁదన్
మలచి సరిదిద్దఁ గలనా:
యలఘుదయం బఱపుమయ్య! హరిహరనాథా:

99.   అక్కజపు నింగి రిక్కల
లెక్కను దక్కువలు సేయులే, నా దోసఁగుల్
ఉక్కుసెడెఁ బెక్కు యతనము
లక్కున గ్రక్కున గదిoపు, హరిహరనాథా:

100.   నాచేఁ గదలదు మెదలదు
పూచిక పుల్లయును, వట్టిపోడుములేలా:
నీ చేయిది విశ్వ సృజనము
యాచించెద నీదు కరుణ, హరిహరనాథా:

101.  తాఁగూరుచున్న కొమ్మం
జేగొడ్డలిఁ బూని నఱకు చెనటిని, గామో
ద్వేగ వ్యసన గ్రసితుఁడ,
నాగడమిది, దీనిఁదొలచు, హరిహరనాథా:

102.   ఇరులంబడి చీకుంబలె
నరిగెడునెడఁ గన్నులున్న యా ఫలమేమీ:
విరిసెడు నీ కరుణాప్రభ,
లరయఁగవలెఁగాక మమ్ము, హరిహరనాథా:

103.   కనుఁదెఱచి జాగరూకతఁ
జనగలనా? బెత్తెఁడైన, స్వవిధిపధానన్,
గనుమూసినఁ గనుదెఱచిన
ననయము నీ ప్రాపుజూపు, హరిహరనాథా:

104.   పరసంపద్త్వైభవ, మే
నరసిన యెడఁ బళ్ళు పులియునట్టి కుసంస్కా
రరతం బేనాటిదయా:
యరమర విడనాడి ప్రోవు: హరిహరనాథా:
   
105.   నా సముచితహితమును నీ
వే సరిగా నన్నుమించి ఎఱుగుదువు ప్రభూ!
నీనరి యెవరున్నారు, కృ
పాసమసుధ జిలుకుఘనులు హరిహరనాథా:

106.   జీవించు నంతకాలము
నీవిమలపు భక్తి, కవనవిధి, యారోగ్య
శ్రీవిభవము, నాకిడి గరు
ణా విష్కృత దృష్టినేలు, హరిహరనాథా:

107.   విరచిత కృతితతి వైశ్వా
నరునకుఁ బ్రియ భక్ష్యమై, జనంబుల పొంతన్
దొఱకె శతకములు నీదయ
యరమరలేకున్కి మూఁ డు హరిహరనాథా:

108.   ఈశతక పుష్పదామము
ధీశులఁ మన్ననలు వడసి పృథివీస్థలిలోఁ
బేశల సుయశ: పరిమళ
మాశాభరితముగఁ గనుత, హరిహరనాథా:

109.   పదితొమ్మిది వందలనలు
బదియేడవ వత్సరాంత వాసరముల స
మ్మదమున దీని రచించితి
నదిరా: క్రీస్తుశకమందు, హరిహరనాథా:

110.   చెలువారు “ద్వారకాతిరు
మల” పుణ్యక్షేత్రమునకు మలనడుమగ ద
వ్వొలయు “దొరసానిపురమున”
నలరెడు ననుఁ గావుమెపుడు, హరిహరనాథా:

111.   గురుకీర్తి గొన్న యొజ్ఞను
విరచిత కృతి సంచయుండ. విమలాశయుఁడన్
వరశతకత్రితయుఁడ, న
న్నరయుము నినుఁ దలఁచువాఁ డ, హరిహరనాథా:

112.   దీనిరచించిన నీసే
వానిరతున్ గుణగణాఢ్యు, వరమహమద్ హు
స్సేనాఖ్యుఁ గవిత్వపద
ధ్యానపరున్, నన్నుఁ గావు, హరిహరనాథా:


2 comments: