Tuesday, 16 August 2016

తెనుగుబాల శతకం



1.      ఎల్లజీవకోటి సృష్టించి పోషించు
ఆద్యునకుఁ గృతజ్ఞతాంజలిడుము
కనులు తెరుచువేళ, కనులు మోడుచువేళ
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

2.      ముఖము కడిగి, స్నానమొనరించి, వలువలు
గట్టి తలనుదువ్వి, బొట్టు పెట్టి
చలిది మెనవి, బడికి సన్నద్ధుడవు కమ్ము
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

౩.       బయలుదేరుమోయి, బడిగంట గణగణ
మ్రోగినంత, వలదు జాగు సుమంత
క్లాసు పిల్లలరుగో! కదలుచున్నారురా!
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

4.      కళలుదేఱు నీ ముఖాన, లేనవ్వు వె
న్నెల రహింప, వేడ్క తొలకరింప
పలకపొత్తమూని పాఠశాలకు బొమ్ము!    
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

5.      పాదరసము వోలెఁ బర్వెత్తు బుద్ధి వి
కాసగరిమఁ జూపఁ గడఁగవలయు,
నాగరికత కీవు నవ్యతల్ దిద్దుమా!
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

6.      అడుగు ప్రశ్నలకును, అనుమానములులేని,
తడుముకొనని, పరుల నడుగఁ బోని ,
ఉచితమగు జవాబు లొసగుము “చకచక’
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

7.      పాఠములను, బద్య పఠనంబునందు, నీ
కీడు నిలుచువారి నెసఁగ నీకు
నీకు లెక్కలందు నీవకావలె సాటి
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

8.      బడికి ముందు నీవ, పాఠoబులకు నీవ,
మార్కులందు నీవ, మంచికీవ
“ఫస్టున” నిలబడగ వలయురా! యన్నింట
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

9.      ఇంటికిచ్చువని, నొకించుక విడఁబోకు
శ్రద్ధ యెడఁద బూని సలుపు మద్ది,
దేశికుండు మెచ్చుఁ దెలివియు హెచ్చురా!
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

10.  విఱనియిమ్ము “కణిక “, “పెన్సిలు” వ్రాసికో
నిమ్ము, జార్చి “యింకు “ నిమ్ము బొట్లు
సాయ మూనుమోయి! సహపాఠకులకిట్లు
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

11.  వలక మఱచితంచు, బలపమ్ము లేదంచు
“బెన్సిలు“కును ములుకు విఱిగెనంచు ,
జీటిమాటి  కిల్లు జేరఁబోరాదురా!
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

12.  పరుల వస్తువొకటిబడెనేని నీ కంట
“నొంటి” దని గ్రహింప నూహగొనకు,
ఒజ్జ కిమ్ము, దాన, నూరెల్ల  మెచ్చురా!
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

13.  గిల్లి, ‘పేచి’ పెచ్చరిల్ల జేయకు మెందు,
లేనిపోని ‘చాడి’ బూనఁబోకు
పెంచఁ బోకు, మిత్రభేద నీతి నొకింత
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

14.  వందలాది పద్య బాణముల్ గుప్పింప
జాలు దేని, సవ్యసాచి వండ్రు
సభలలోన, నీ ప్రశంస మిన్నంటురా!
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

15.  వ్యాకరణము రాక, భాషలో “నివి తప్పు”
“లివ్వి యొప్పు” లంచు నెఱుగలేవు,
గాన శ్రమకు నోర్చియైన “గ్రామరు” గొమ్ము
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

16.  లేనివానియెడల న్యూనత సూపకు 
జాలిపడుము నుంత సాయపడుము
ఆశిషంబు లిడుదు ,రమరులు మెచ్చి
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

17.  చీమకైన హాని సేయరాదను మాట
హృదయ మున్నవార లేగుబాట
ఎల్లజీవులందు నీశుఁ డొక్కoడౌట
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

18.  కల్లలాడరాదు, కపటియై మనరాదు
చెప్పరాని చేటు చివరఁ గలుగు,
“గొల్లపిల్లవాని కల్ల – కథ వినవో”
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

19.  ఆడుపిల్లలెల్ల, రక్కచెల్లెండ్రు, సో
దరులు బాలురెల్ల, రరసి గనుము
అన్యులెవ్వరిందు నందఱు నీవారె!
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

20.  చదువుటలును, వ్రాయఁజాలుట ,లేయింటి
చిన్నిపాపలైనఁ జేయగలరు
చదువనంగ వమల సాహిత్యమే సుమీ!
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

21.  పంచకావ్య పఠన మించుక లేకున్నఁ 
బేరులైనఁ గడకు నేరకున్నఁ 
జదువుకొన్న వారి సరస నిల్వగ లావె
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

22.  కొసరి కమ్మనైన గొంతెత్తి సికమట్లు
పద్యపఠన సేయ వలయునోయి!
వినెడు వార, లనుభవింప వలయు హాయి!
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

23.  నీ వెసంగు చోట తావి “గుప్ గు” ప్పను
మల్లెవోల, మేలు జల్లుమోయి!
నీ దువర్తనమె, జవాది కావలయురా!
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

24.  నిరతి నెగడవలయు, నీ యండ పేదకు
మఱియు బిన్నకును, అమాయకునకు,
నివ్వటిల్ల వలయు నీదండ బడికెల్ల
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

25.  ప్రతి దినమ్ము లేచి ప్రత్యూషమునఁ బాఠ్య
విషయ రాజి వల్లె వేయుదేని,
శారదాదయా ప్రసన్నత లబ్బురా!
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

26.  బలమె సంగెనంచు బలనoత పెట్టకు
పిన్నవారి, నెడద వెఱచు వారి,
నిన్నువించు బలు, ల నేకులున్నారులే!    
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

27.  తప్పు నొప్పుకొనుట తప్పుకా, దది  హీన
తయునుగాదు గొప్పదనము నూవె !
ఒప్పుకొనడె గాంధి తప్పులు పల్మరుల్
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

28.  అచ్చటచట నాడి యల్లరీడుల గూడి,
తీఱబోని తగవు తేకుమోయి!
బేరజములు రోసి, పెంచుము నీవాసి,
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

29.  త్రాగుబోతువోలె, తందనాలాడకు
తిట్టబోకు, మొరుల, గొట్టబోకు,
రేగుకంపవోలె రేగి , కాట్లాడకు
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

30.  మంచితనవు మలయమారుత సౌరభ
మ్ములను దెసలనింప గలుగుదేని!
“తల్లిదండ్రి  కడుపు చల్లన “ యనియండ్రు
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

31.  ముద్దులొలుకు ‘ముత్యములకోవ‘ లటు ,లక్క
రముల వరుసలెల్ల వ్రాయవలయు,
రోతబుట్టు చెనఁటి వ్రాత వద్దురబాబు!
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

32.  నిన్ను జూడరెవరు, నీ వ్రాత గని సువ
ర్ణాక్ష  రమ్ము లెవరి వందు రివ్వి!
“ఏ వరాలకడుపు పావన ఫల” మండ్రు
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

33.  మెల్లజేరి, పొగడి, బెల్లించి, నీ తేగ
ముక్కనైన విడడు టక్కరీడు!
కాకిగన్ను గప్పెగద  నక్క! మఱతువా!
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

34.  గడ్డ పెరుగు, చలిదికన్న బలాహార
మెద్ది కలదు? పాలమించు నెద్ది ?  
“కాఫి, టీలు,ను విక్షి కవితవదార్ధముల్
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

35.  తప్పులేని వేళ, ధైర్యంబు గోల్పోకు
జబ్బచఱచి నిలుము సత్య మందు
నిన్ను గాచు శివుడు నివసించి ఋతమందు !
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

36.  పరుల తప్పు బట్ట బరువు లెత్తగబోకు,
మేలుకాదు పిసరు, మెచ్చరెవరు,
ఎదురువచ్చు సహిత, మింతంత కాదురా!
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

37.  ఎట్టివానినైన , నెగాతాళిసేయకు,
వెక్కిరింపబోకు వికలదేహు,
ఎత్తిపొడువబోకు, మేకృతఘ్నునిగాని,
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

38.  ఎందఱున్నవారొ! ఈ చిటి  పొటిపాప
లందు, “నెహ్రు” “లిందిరమ్మ” లంత
వార, లుజ్జ్వలంపు భావిభాసిలువారు!
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

39.  ధనము సౌఖ్యమిచ్చు “దన” యనువారికే!
సౌఖ్యమిచ్చు గళలు, జనులకెల్ల
ఇడదు “లుబ్దత” సుఖ, మెవ్వారికైనను,
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

40.  మంచివానికిమ్ము, మంచిపనుల కిమ్ము
మంచినుడులకిమ్ము, మనసులోతు
మంచియనెడు నద్దమందు నిన్గనుమురా! 
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

41.  అవసరమునకైన, యాచింపగాబోకు,
మున్నదాన దృప్తి నొందుమెందు,
వెలితి జూపబోకు, వెకలివి కాబోకు,
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

42.  హృదయమిడు సుహృత్తు, నెవుడైన, నెదియైన,
హద్దు మీఱకుండ, నడుగవచ్చు,
జెలిమి జిదుపరాదు చేయ నభ్యర్ధనల్
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

43.  చేరి యోగ్యునొద్ద జేయిసాచిన వేళ,
నీయకున్న, నింత హీతము గలుగు
జెనటి, మొకమువాయ జీవాట్లు పెట్టురా!
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

44.  క్లాసు పిల్లలకును గావలె నీవ, యా
ప్తుండ, వాత్మ బంధువుడవు, సఖుడ,
విష్ట గురుడ, వెల్లయెడ, నాడ, నాడింప,
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

45.  చదువులేక, లేదుకద ప్రజారాజ్యంబు
ప్రజల ప్రతినిధులదె పాలనంబు,
బాలలెల్ల బ్రజలు, భావినాయకులును
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

46.  పౌరవిధు లెఱిoగి, బాధ్యతల్ గుఱుతించి,
మఱచి స్వార్ధపరత, దెఱచి కన్ను,
అడుగు బెట్టుమోయి, ఆశా జగత్తున,
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

47.  ఓటు విలువ దెలిసి, యుపయోగమంద జా
లిన జనుండు చదువు కొనిన వాడె!
చదువనంగ హృదయ సంస్కార బలమురా!
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

48.  మాటలాడుమోయి, మంచిగా, జల్లగా,
మెల్లగా, హీతమ్ము, మృదువు గాగ
బరులయెదలు పొంగు పన్నీటి జల్లుగా
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

49.  నిన్నుజూచి మెచ్చి నేర్చికోవలయు , నా
దర్శిచరిత , నీతి ధర్మములను.
చదువు చదురులెల్ల, సాటి బాలకకోటి!
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

50.  నిలుపుకొమ్ము పరువు, నీ దేశ ,జాతి,జా
తీయతా పతాక దీప్తకీర్తి!
అవ్విలేక పోకకైనను గొఱగావు.
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

51.  ఏ విదేశమందు, నే సభావేదిపై ,
నెచటనైన ఱొమ్ము నింత జేసి
తెనుగుగడ్డ వాసి తెలిపి ‘జే’ కొట్టరా!
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

52.  మాతృదేవి యొకటి, మాతృభూమి యొకండు,
మాతృభాష యొoడు , మాన్యము గద
మాతృశబ్దము విని, మది పులకింపదా !
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

53.  ఆదరించి, యతిధి – నభ్యాగతిని, సేద
దీర్చి, కడుపు నింపి , తృప్తి గూర్చు
నాంధ్రసీమ యిద్ది! “యన్నపూర్ణ” గృహంబు
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

54.  ఇచటి పుణ్యనదులు, నిచటి సాగరతీర
నాళికేర నందనములు గంటె!
బహుళ సస్యహరితభరిత మాoధ్రోరోర్విరా !
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

55.  ఇచటి శిల్పకళలు, మృధు కవితాగాన
లీల, లిచటి  చిత్రలేఖనములు,
నెచట గలవు! సొంపులిడు గుళ్ళ గోపురాల్
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

56.  మనయదృష్ట నిధులు, - మావి, సపోటాలు ,
అరటి పనస జాతు – లమరతరులు
నవరసాల కమల నారింజ బత్తయీల్ ,
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

57.  ఇచటి గడ్డపెరుగు, నిచటి జిడ్డుఘృతంబు,
కమ్మనైన “జున్ను – గడ్డ” పాలు
పాయసములు, గాన వచ్చునా యెoడెడ!
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

58.  ఇచటి వర్షధార – లిచటి చల్లని గాలు,
లిచటి వేసవి, మఱియెచట గలవు!
మన త్రిలింగసీమ, మఱవజెల్లదు సుమా!
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

59.  ‘గంగ’ కన్న మిన్న ‘గౌతమి’ మనకిట
‘కృష్ణ’ యమున కన్న నేమి లొచ్చు !
వేంకటేశ్వరుoడు వేలువు మనకెల్ల.
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

60.  తల్లిదండ్రి మనకు దనువులిచ్చినవారు
దేశికుoడు గుణము దిద్దు ఘనుడు
వారి దీవెనలకు బ్రణతు లర్పింపుమా!
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

61.  తల్లికన్న మించు దైవంబు మఱిలేదు
నాన్న కన్న మిన్న యెన్న సున్న 
జన్మభూమి కన్న స్వర్గంబు లేదురా!
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

62.  ధనముకన్న మిన్న ఘనమానవత్వంబు
కులముకన్న మిన్న గుణ ధనంబు
చదువుకన్న మిన్న హృదయ సంస్కారంబు
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

63.  కృషి యొకింత విడకు, మీశుడిచ్చు “ఫలమ్మో!
తృణమో !” కళ్ళ కద్దుకొనుము తృప్తి,
కోరికలను బెంచి నైరాశ్యమందకు
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

64.  వట్టి పొట్టకూటి బ్రతుకేల ? పురుషార్ధ
రహిత జీవనము నిరర్ధకమ్ము .
కాకి బకము లొకరిచీకు బోగొట్టునా!
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

65.  బాలలన్న భావిభారత పౌరులు
జగము నుద్ధరింప జ్ఞాననిధులు
సరళగుణ వికాస సాత్వికమూర్తులు
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

66.  ఒజ్జలన్న భారతోజ్వల భావి భా
గ్యంబు రేఖ దిద్ద గలుగువారు!
భారతీయ సంస్కృతీరత బోధకుల్!
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

67.  చదువు సఖుడు, గురుడు చదువు మూడవకన్ను,
చదువు సంస్కృతినిధి, సౌఖ్యకరము,
చదువుమించు నాత్మ సంపదలేదురా!
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

68.  ఆత్మగౌరవమ్ము, లందఱిసొత్తు, నీ
కొక్కరునికి “జేబురొక్క “ మగునె ?
మన్ననం బొసంగి మర్యాద గాంచరా!
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

69.  నరనరాన హర్ష ఝరులు బాఱిoచి, మ
త్తెక్కజేయు, నెడద జొక్కజేయు ,
అమలగానవిద్య నభ్యసింపు మొకింత !
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

70.  గొంతుతీయ దనము కోటి జన్మల తప:
ఫలనుధార్ధ్ర సుకృత వశతగాక,
సాధనాంతరముల సాధింపబడదురా !
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

71.  పరుల సేవ సేయువాడె మానవుడన్న
బరులకున్న దిచ్చువాడె వేల్పు !
పరుల మోసగించు వాడె దానవుడన్న
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

72.  కష్ట కాలమందు నష్ట కష్టములోర్చి
సాకువాడె దైవ సముడుగాక !
“అన్నమన్న”సున్నమదె ! యన్న వాడౌనె!
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

73.  ఎట్టి సమయమందు నేని “అన్యుల దూష
ణమ్మువలదు భూషణమ్ముదక్క”!
నాల్కయొకడ, ముప్పునకు మెప్పునకునైన,
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

74.  త్రొక్కబడుచునుండు నొక్క శిలాఖండ,
మొకడు దేవవూజ లొందుచుండు
అదె యభాగ్యమన్న, ఆలయోగబలమన్న!
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

75.  సరళ సంస్కృతాన, సహజ సౌందర్యక
ల్పనలయమర  సృష్టి పొదుకొలిపి,
రాముపుణ్యగాధ వ్రాసెరా ! వాల్మీకి,
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

76.  “భారతంబు,” ”భాగవతంబు”,”గీతాసుధ”
వేదసంహితలను వెలయజేసె,
వేల్పుబాసయందు విమలుండు వ్యాసుండు
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

77.  కవుల పలుకులన్న గలకండ పలుకులు
కవనమన్న మలయ పవనమె  సుమి!
అమల కావ్యమన్న “ఆనంద గుళికిరా!”
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

78.  తెనుగు మల్లెతోట, తన చంద్రవంశీయ
రాజకథలు విరియ, రాజరాజు
పైడికాన్క  లిచ్చి భారతమ్ము వెలార్చె
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

79.  జాతిసంస్కృతి హిత సౌరభ్యముల్, తెన్గు
నాట, గప్రవు గవనముగ జల్లి
నన్నయ మనయెడల గన్నయ్య యయ్యెరా !
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

80.  మిసిమి, మీగడ, చవిమించి, “పాల్కోవాను”
మీఱు , రెండునఱయు భారతమును
“ఆదికవి” తెనుంగునంద మరించెరా !
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

81.  తెనుగుబాసహొయలు, తెనుగుదనముఠీవి,
తెనుగు తీయదనము దెలియజాటె;
“తిక్కన” మనపాలి దేవతామూర్తిరా!
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

82.  సంస్కృతమున మోజు సడలించి, పదునేను
పర్వముల తెనుఁగు బారతంబు   
“ఆజ్యరుచి”ని మించి యలరిoచె “సోమాసి”
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

83.  పాలు పంచదారవలె, నాంధ్ర సంస్కృత
సమవదాల మధురశైలి గూర్చి
“ఎఱ్ఱన” మనరసిక హృదయాల దోచేరా!
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

84.  గుబులు కొనుగులాబి గుత్తుల గుమగుమ
లెసగ శoభుదాను డిచ్చెమనకు
గానుక, యఱపర్వకలిత మాoధ్రీకృతి,
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

85.  ఇక్షురసముకన్న, ద్రాక్షాసవముకన్న
భాగవతము మధురభక్తి యుతము
“పోతన” కవనంబు పుణ్యభూమి ఫలంబు
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

86.  హలము బూని సేద్యమలరించె గుక్షికై ,
కలము బూని నింపె జ్ఞానసుధలు
“సహజబుధ్ధుడు” భోగసంగతి విరసుండు
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

87.  రాజు మాత్రగాడు, రారాజు కవులకు
“రాజరాజు” సాహితీజగాన ,
కృష్ణదేవరాయలే! “ఆంద్రభోజుండు”
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

88.  కదనమందు విలయకాలుడై యరులకు
గవులకయ్యె బెరటికల్పకమ్ము
ప్రౌఢకృతి జనకుడు, రాయలకెవరీడు !
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

89.  మగలె కాదు ప్రతిభచిగురించు మగువలు
సైత మల్లినారు జానుకైత,
మొల్ల, రంగజమ్మ అల్ల, వెంకమ, గంగ
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

90.  అల్లసాని, నంది, అయ్యలరాజ, పిం
గళి , తెనాలి, భట్టు, మలన, ధూర్జ
టి, మహనీయ కవులు సుమి! అష్టదిగ్గజాల్
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

91.  “కాళిదాసు” కంటే కవి కుమారుడు లేడు
‘హర్షు’ వంటి సృవతి యసలె లేడు
‘కోహీనూరు’ వంటి గురురత్న మున్నదా!
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

92.  తాటికాయలంత తమ తప్పులెఱుగరు
పరుల నలుసులెన్న ప్రభువులంత,
కడుపులోని క్రుళ్ళు గ్రహియింతు రెవ్వారు?
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

93.  ఉన్నతాశయముల, నురు దీక్షతో బూని
రేయి, పవలుగా బరిశ్రమించి,
కలలుపండ, సార్ధకము సేయవలయురా!
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

94.  లెస్స చదివి, చేసి “ప్లీడరీ” రెండు చే
తుల గడించి పెంచవలయు వాసి,
“ఆంద్ర కేసరి” సరియనిపించుకోవలె,
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

95.  త్యాగశక్తి జూపె, నాత్మర్పణ మొసర్చి
రాష్ట్ర సిద్ధి గూర్చె , శ్రమలకోర్చి
“పొట్టి రాము”, డట్టి  దిట్టవు కావలె,
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

96.  “నెహ్రు, ‘బోసు’ వంటి నిస్స్వార్దు’డని , ‘పటేల్,
వంటి స్థైర్య చిత్తబలుడటంచ ,
లోక మెన్నవలయునీ కంజలి ఘటించి
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

97.  నేటి బుద్ధుడైన నిర్మలాహింస ప్ర
వక్త ‘గాంధి’ సాటివాడ వంచు
నీకు నెల్ల ప్రజలు ‘జే’ కొట్ట వలయురా!
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

98.  కీర్తి గాంచినాడు ‘గీతాంజలి’ కతాన,
నతుల ‘నోబెలు’ బహుమతి గ్రహించి
'ఠాకు’, రట్టివాడవై, కాంచుము యశమ్ము
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

99.  తీయతీయ కలలదేలి, నీ బుద్ది కౌ
శలమే ‘పెట్టు బడిగ’ నిలువ జాలి,
పడసి వర్తకమ్ము, భావిసంపద గొమ్ము
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

100.                      ఠీవి మెఱయ గొమ్ము, టెక్నికల్ డిగ్రీ, ప
రిశ్రమలను, దేశవృద్ది బెంప
భరతమాత నోము ఫలియింప, సిరినింప,
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

101.                      దివమువదలి భువికి దిగిరారు దేవతల్
గొప్పదనము జూప గోరియెవరు!
త్యాగ గుణము వెలయు ధన్యులే యమరులు,
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

102.                      పరులమేలు గోరి పాట్పడుదేని, మ
హాత్ములేగు త్రోవ నరుగ గలవు!
పూవు పుట్టినపుడె తావి గుప్పనవలె
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

103.                      గొప్పవారి చరిత లెప్పుడు జదువుము
వారి యాచరణల తీరు గనుము
నీతి, రీతి, స్ఫూర్తి, నీకిచ్చు నవియెల్ల
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

104.                      అహము బెంచబోకు, మధికారము వరించె
నంచు, నిల్వగలదె? యట్టి పొంగు !
క్రుంగినపుడు నీవు క్రుళ్ళిపోయేవురా!
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

105.                      కలిమి కలిగినంత గనులు నెత్తికినెక్కు
వార, లంతరువులు గోరుచుంద్రు,
బూటకమది బాబు! పోకుమాదారికి
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

106.                      గౌరవమ్మొసంగి  గౌరవమ్మును గొమ్ము
క్షీరమిచ్చి నీటిధార గొమ్ము
నీవు గోరు విలువ, నెఱపు మన్యులక్రేవ,    
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

107.                      పొగరుచూప బోకుమోయి! “సర్ పంచ్” కుమా
రుండ, “మెంబరు” “కొమరుండ “ నంచు;
ఎంతకాలమీ యదృష్టంబు నిలుచునో !
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

108.                      అరె! ఓరే ! యటంచు నధమ సంబోధన
నేయబోకు మేరి జీరునవుడు !
‘తక్కు వెక్కువ’ లను తలపు లెడ్డెవిసుమీ
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

109.                      అధిక నిద్రగనుట, యదియొక పాపంబు
అధిక భోజనంబు నఘకరంబు
అధిక ధనముగూర్చుటది మహాకలుషంబు
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

110.                      ఇంటదూఱి, కాక, మేదిచౌర్య మొనర్చె?
పికము మనకు దెచ్చి పెట్టేనేమి!
నోటితీయదన మె నూఱులాభములిచ్చు
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

111.                      అడుగరానివస్తు, వదియొక్కటే సుమీ!
అప్పు; చేతులారా ముప్పుగొనుటె !
అప్పులేని పేద ,ఆత్మశాంతికి బెద్ద
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

112.                      పుట్టునా! శివాజి బోలు పరాంగనా
మాతృభావశీల మాన్య సృవతి!
ఢిల్లి చక్రవర్తి గొల్లగొట్టిన మేటి!
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

113.                      'చెప్పువార లెవుడు జేయ లేర’ను మాట
మఱవ బోకు, ప్రగతి మాన బోకు,
చేసి, ఫలముగనుము , చెప్పుమాపదపడి,
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

114.                      చదువలే డొకండు సాగిఇంచు కోతలు
చదువనీడు తోడి చదుపరులను
సరసజనకు, వాని సంగాత మొల్లకు,
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

115.                      నోట రామమంత్ర, మూటలు సాగ, డెం
దమును స్వార్ధచింత దడువుచుండు
లోభి, పిల్లి మెడకు రుద్రాక్షమాలరా!
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

116.                      తనదుతప్పు తెలిసికొనజాలిన వివేకి
సత్యపధి ‘అహింస’ జనినతనసి!
భారతిజాతికయ్యె “బాపూజి” గాంధీజీ!
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

117.                      రాజకీయ వేత్త, రచనాధురంధరుం,
డనశన  వ్రతంబు గొనినయోగి,
అంగవస్త్రధారి ,హరిజనాతిధి , గాంధి!
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

118.                      వృత్తులందు లొచ్చు, లెచ్చులులేవు కా
వలయు వృత్తులెల్ల బ్రజల కొఱకు,
హీనుడెఱుగ డిద్ది ; ఇతి “గాంధిజి ఉవాచ”!
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

119.                      ఏక పుత్రుడయ్యు ,నింద్ర వైభవుడయ్యు ,
వలచె “సోషలిజము – బాట,” నెహ్రు!
“బాప్జి”వారసుండు ప్రధమ ప్రధానిరా !
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

120.                      నెహ్రూజీ, రచించె నేర్పుమీఱ “బ్రపంచ
చరిత”, “స్వీయచరిత,” “భరతదర్శనంబు”
విశ్వమెల్ల నమసులర్పింపoగా
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

121.                      పణము బెట్టి, బ్రతుకు భరత సమగ్రతా
వృద్ధికై యతించి రేయుబవలు
ద్యాగశీలి నెహ్రు – అయ్యేరా “చాచాజీ”
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

122.                      “ఇందిరాహయాము” – నందు, విదేశాoగ
విధి ఫలించె“ నంచు విశ్వనేత
లెల్ల, ముక్కులపయి, వ్రేళ్ళుoచుకొన్నారు !
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

123.                      తీయని హృదినిమ్ము, తీయనినుడు లిమ్ము ,
తీయనైన జెలిమి బాయకిమ్ము,
లోకమెల్ల బాడు, నీకు మంగళగీతి !
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

124.                      కృతులు పెక్కు చేసీ కీరితిపండించు
కొన్న శిష్టనితుడు గురుడు గుణుడు
మలచె గృతిగ దీని, “మహమద్ హుసేన్ కవి “     
వినుత ధర్మశీల ! తెనుగుబాల !

3 comments:

  1. Great Uncle. Good to see one more good book from great poet!!!

    ReplyDelete
  2. Chichcha,
    Dad used to tell me, in my childhood that people in this world can be divided into three groups. Those who make things happen, those who watch things happen and those who wonder what has happened. You are the captain of the first group.

    Thanks for putting Daada on the web.
    Daada lives on.

    Lots of Love,
    Galib Shaik,
    GS/o SMD Hussain

    ReplyDelete